Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

కుమారస్వామి అపరావతారమైన కుమారిలభట్టు

నేడు స్కందషష్ఠి సుబ్రహ్మణ్యస్వామికి ఇది ప్రీతిపాత్రమైన దివసం. భక్తులకు అన్నిదివసములు విశిష్టమైనవే. వారికి పుణ్యదివసముల ఆవశ్యకత లేదు. సామాన్యమానవులకే పుణ్యదివసాల ఆవశ్యకత. ఆ రోజుననైనా అందరకు భగవంతుని స్మరణం కలుగవలెనన్న ఉద్దేశముతోడనే పుణ్యతిధులను ప్రత్యేకంగా ఏర్పరచేరు.

ఒక్క సుబ్రహ్మణ్యస్వామికే స్వామి అన్నపేరు ఉన్నది. తక్కిన దేవతలు వీరిదగ్గఱనే స్వామి శబ్దాన్ని ఎరువుతెచ్చుకొన్నారు.

''దేవసేనాపతి శ్శూరః స్వామీ గజముఖానుజః'' అని అమరము. తిరుపతి క్షేత్రంలో స్వామి పుష్కరిణి అనే తీర్థం ఒకటి ఉన్నది. కుమారధార అని వేరోక తీర్థం. హిందుస్తానీలో వేంకట రమణుని 'బాలాజీ' అంటారు. బాలుడన్న పేరు సహితం సుబ్రహ్మణ్యులదే. ఉత్తర దేశంలో వారిని సుబ్రహ్మణ్యులు అని పిలువరు. 'శివకుమారుడు, శివబాలుడు' అని పిలుస్తారు. తమిళంలో విద్యావంతులందఱు ఈ స్వామియం దధికభక్తి కలవారే. వీరిని 'తమిల్‌దైవం' అని శ్లాఘిస్తూ ఉంటారు. 'మరుగన్‌' అనే పేరుతో గూడ ఈ స్వామిని పిలుస్తారు. మొత్తం తమిళ##దేశానికి అధిష్ఠానదైవంగా ఈ స్వామిని ఎన్నిక చేస్తారు. ఇక బ్రాహ్మణ్యమునకు తగిన కర్మానుష్ఠానము కలవారు ఈ స్వామియే సద్బ్రాహ్మణ్యమునకు ఆధారంగా ఉన్నారని 'సుబ్రహ్మణ్య' నామంతో వీరిని పిలుస్తూ ఉంటారు. వేదాలనభ్యసించి వైదికర్మానుష్ఠానాలు చేసే వారు కూడా వీరిని సుబ్రహ్మణ్యనామధేయంతో కొనియాడుతారు. ఇది ఈ స్వామియందలి విశేషం.

సుబ్రహ్మణ్యుడన్న పేరుకు మంచి బ్రహ్మణ్యుడని అర్థం. పైన చెప్పిన ఇరుతెగలవారేకాక ఈ స్వామిపై ప్రీతికలవారు మరి ఇద్దరున్నారు. వారు పార్వతీపరమేశ్వరులు. లోకమాత పార్వతి, లోకపిత పరమేశ్వరుడు.

జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ|

- రఘువంశము.

అని కాళిదాసకవి రఘువంశకావ్యంలో వర్ణించేరు. 'తల్లిదండ్రులే ప్రథమదైవములు' -- అని అన్వైయార్‌ అన్నారు. తల్లిదండ్రులుగా ఉన్నది దైవమే. వారే పార్వతీపరమేశ్వరులు. వారిరువురును కలిసి అనుగ్రహించుటలోనే విశేషం ఉన్నది. వేరువేరుగా అనుగ్రహిస్తే చాలదు. ఇరువురియందు సమానమైన భక్తి ఉండాలి.

'అలాకాక శూర్పణఖ ఒక్క రామునియందు, రావణుడు ఒక్క సీతయందు మాత్రమే ప్రీతికలవారైనందున వారు చాలా కష్టపడ్డారని' ఒక కవి చతురంగా చెప్పేడు.

అందుచే పరమేశ్వరుని అంబికను ఏకభావముతో భక్తితో సేవించాలి. అప్పుడే అధికశుభం కలుగుతుంది. ఇరువురి యందును సమానమైన ప్రీతి ఉండవలెనన్న ఆ ఇర్వురియందు మాతాపితృభావం ఉంచాలి. వారు ఆదిదంపతులు. వారిద్దరూ చేరి అనుగ్రహించాలి. వారిని మనం వేరుగా భావించకూడదు. తమిళంలో 'భాగంప్రియ' అని అంబిక కొక నామం ఉన్నది. పార్వతీ పరమేశ్వరు లిద్దరూ వేరువేరుగాకాక చేరి ఒక్కరై అనుగ్రహించుటకే అర్ధనారీశ్వరుల ఆవిర్భావము. తిరుచ్చెంగోడు అనే స్థలంలో అర్ధనారీశ్వరమూర్తి ఉంది. వారు అనుగ్రహిస్తే ఇరువురూ అనుగ్రహించినట్లే. అర్థనారీశ్వరుల విషయంలో ఒకకవి చిన్నకలహం లేవదీసేడు.

సాధారణ స్మరజయే నిటలాక్షి సాధ్యే

భాగః శివోభజతు నామ యశఃసమగ్రం|

వామాంఘ్రిమాత్రకలితే జనని త్వదీయే

కా వా ప్రసక్తిరిహ కాల జయే పురారేః||

- ఆనందసాగర స్తవం.

పరమేశ్వరుడు మన్మథుని జయించినట్లు చెప్పుతారు. అట్లు జయించినది మూడవ నేత్రము. అర్ధనారీశ్వర రూపంలో ఆ నిటలాక్షం ఉన్నది. అది ఇరువురిలో ఎవరికి చెందుతుంది? అందులో ఇద్దరకూ భాగం ఉంది, కాని మన్మథుని జయించేడన్న కీర్తి ఒక్క స్వామికే దక్కింది. ఇది అన్యాయం కాదా! ఇది ఇలా ఉంచి ఏ సంబంధమూలేని ఒక పేరు స్వామి పెట్టుకొన్నారు. కాలసంహారకు ఉన్నది. ఆ పేరు. ఆయన కాలుని (యముని) ఏ కాలితో తన్నినారు? వామపాదముతో కదా! ఆ వామపాదం ఎవరిది? అంబికది. అప్పుడు కాలుని జయించిన కీర్తికీ స్వామి సంబంధం ఏమిటి? అంటాడు ఆ కవి. ఆయనయే వేరొకచోట ఇలా వ్రాసేరు.

అశక్య మంగాంతర వద్విభక్తు| మణుప్రమాణం కరూం యదంతః|

సామాన్యభూతం శివయోస్తదేకం| సానుగ్రహం స్యాన్మయి గర్భదాసే||

- శివలీలార్ణవము.

అర్ధనారీశ్వరులు అనుగ్రహిస్తే పార్వతీ పరమేశ్వరులిద్దరు అనుగ్రహించినట్లే. అయితే అర్ధనారీశ్వర చరణాను గ్రహం దొడ్డదా లేక కటాక్షవీక్షణం దొడ్డదా? చరణానుగ్రహమే గొప్ప అనుకొంటే ఏ చరణం? అన్నవివాదము, కటాక్షవీక్షణమే గొప్ప అనుకొంటే ఏ కంటిచూపు అన్న సందేహమూ పుట్టుకొని వస్తాయి అందుచే ఆ మూర్తిలో ఇద్దరకూ చెందిన వస్తువేది ఉన్నదో దాని అనుగ్రహం పొందితే ఇద్దరి అనుగ్రహమూ మనం పొందినట్లే. అయితే అట్టి వస్తువేది? అది వారి అంతఃకరణము.

తర్కంలో పదార్థాలు ఏడురకాలు అన్నారు. వానిలో ద్రవ్యం అనేది ఒకటి. ఆ ద్రవ్యంలో మనస్సు ఒకటి. ఆది అణుప్రమాణం. ఆత్మకూడా ఒక ద్రవ్యమే. అది ఇక్కడ అక్కడ అని కాక అంతటా నిండి ఉన్నది. మనస్సు ప్రమాణముచే అణువు. అన్నిటికంటె సూక్షమైనది అణువు.

'తచ్చ ప్రతిశరీరం భిన్నం'|

- తర్కసంగ్రహము.

మనస్సు ఒక్కొక్క దేహంలోను ప్రత్యేకంగా ఉన్నది. ఒక్కొక్కరి మనస్సూ అణుప్రమాణంగా ఉంటుంది. అణువు నందు అవయవాలుండవు. అవయవాలు కలదానిని రెండుగా విడదీయవచ్చు. అణువు నిరవయవం. ఏ వస్తువును, దానికంటె ఇంకా చిన్నదిగా విభజించుట సాధ్యముకాదోఅదియే అణువు. ఒక గోలీ (పిల్లలాడుకొను గుండ్రని చిన్నరాయి) తీసికొంటే దానిని విభజించడం అసాధ్యంకాదు. దానిని చిన్నదిగా ఇంకను చిన్నదిగా విభజిస్తూపోవచ్చును. దానికి ఎన్నో అవయవాలన్నమాట. అందుచేతనే విభాగం సాధ్యం అయింది. గుండ్రాయి కూడ అనంతావయవములు కలిగినదే. ఆవగింజయు, మేరుపర్వతము కూడ అట్టవే. అవయవ విషయంలో ఆవగింజకు మేరువుకు భేదం లేదు. మేరువు భిన్నమౌతూ పోయి పోయి ఒకచోట నిలిస్తే అదే ఆవగింజ. రెండింటికి పరిమాణంలో మాత్రమే భేదం ఉంది. ఇట్లు ఒక వస్తువును విభజిస్తూ పోగా పోగా ఇక విభజించరాని స్థితి ఒకటి ఏర్పడుతుంది. ఆ స్థితికి చేరిన వస్తువే అణువు. అట్టి అణుపరిమాణమైనది మనస్సు. దేహికి కన్నులు రెండు, చెవులు రెండు. మిగతా అంగములుకూడ సాధారణంగా రెండు భాగాలుగా ఉన్నాయి. కాని మనస్సు మాత్రం ఒక్కటే. దానిని విభజించుట సాధ్యంకాదు. నిరవయవమైన అణువు. పై శ్లోకంలో కవి దానినే పేర్కొన్నాడు.

''ఇతర అవయవాలవలె విభజించుటకు వీలుకాని వస్తువు అంతఃకరణం. అది ఇరువురికిని పొదువైనది. దాని అనుగ్రహం లభిస్తే మీ యిద్దరి అనుగ్రహమూ లభించినట్లే''అని ఆయన చమత్కరించేడు.

అయితే ఆ ఇరువురి మనస్సులును చేరి అణువుగా అయ్యేచోటేది?

శివం-ఆనందరూపం

ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌|

- తైత్తరీయోపనిషత్‌.

ప్రేమయు శివమే. మంగళమూ శివమే. అంబిక సర్వమంగళ. ఈ ఇరువురి మంగళకరమైన ప్రేమ ఎక్కడ కలుస్తోంది? ఆ కలయిక సుబ్రహ్మణ్యుని యందే. ఆ ఇరువురి అనుగ్రహముయొక్క ఐక్యరూపమే సుబ్రహ్మణ్యస్వామి. ఆ స్వామి అనుగ్రహం లభిస్తేచాలు, పార్వతీపరమేశ్వరు అనుగ్రహం మనకు లభించినట్లే. అలా స్వామి అనుగ్రహం పొందదగినరోజు సుబ్రహ్మణ్యషష్ఠి. ఆంధ్రదేశంలో దీనినే 'సుబ్బారాయుడు షష్ఠి' అంటారు. ఆ రోజున వారు వ్రతమాచరిస్తారు.

స్వామి సుబ్రహ్మణ్యులుకదా! అందుచే బ్రాహ్మణ్యమునకు ఎప్పుడు లోపం కలిగినా దాని అభ్యుత్థానం కొరకు వారు అవతరిస్తూ ఉంటారు. తమిళ##దేశంలో 'జ్ఞానసంబంధులు'గా వారు అవతరించేరు. అప్పుడు నాస్తికులను తొలగించేరు. వేదమార్గాన్ని కాదని, నాస్తికవాదాన్ని ప్రవర్తింపజేసి జైనులను జయించేరు. వైదికానుష్ఠానములయందు, వేదములు చెప్పిన పరలోకములయందు విశ్వాసం లేనివారే నాస్తికులు. వారు వేదాలను, యజ్ఞాలను నిందిస్తారు. ఈశ్వరుని ఆజ్ఞయే వేదం. దానిని అనుసరిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. దానిని ఎవరు అంగీకరించరో వారిని వాదించి జయించాలని జ్ఞానసంబంధులు తలచేరు. కొందరి బుద్ధి వాదనలోకూడ ప్రవర్తించక మూర్ఖంగానే ఉంటుందని వేరు ప్రయత్నాలుకూడచేసి వైదికమతాన్ని వారు సుస్థిరం చేసేరు. ఆ జ్ఞానసంబంధులు కుమారస్వామి అవతారము. అందుచేతనే అంబిక తన క్షీరం అనగా జ్ఞానపయస్సు వారికిచ్చుట, వారు పూర్ణజ్ఞానులై జ్ఞానసంబంధులనే పేరు వహించుట సంభవించింది.

శ్రవణులను జ్ఞానసంబంధులు కొరమాను (శూలమువంటిది) మీదకు ఎక్కించినట్లు చెపుతారు. అది వారిలోని ఒకలోపమే అనిసిస్తుంది. కాని నీలకంఠ దీక్షితులవారు శివలీలార్ణవములో వారి చరిత్ర వ్రాస్తూ వారియందీ లోపం ఉన్నట్లు వ్రాయలేదు. శివలీలార్ణవంలో మధురలోని శివుని లీలలు వర్ణింపబడ్డాయి. జ్ఞానసంబంధుల చరిత్రకూడ ఆ వరుసలోనే చెప్పబడింది. అందు ఇలా ఉన్నది.

'జ్ఞానసంబంధులతో వాదించుటకు ముందు శ్రవణులు తాము పరాజితులైనచో శరీరత్యాగం చేస్తామని ప్రతిజ్ఞచేసేరు. వారు వాదనలో ఒడిపోయేరు. వారు నాస్తికులే అయినా వారిలో కొన్ని సుగుణాలు ఉన్నాయి. వారు ఆడితప్పరు. అందుచే వారు స్వయంగా కొరమానుమీదకు ఎక్కి ప్రాణత్యాగం చేసికొన్నారు' ఇట్లు శివలీలావర్ణంలో వ్రాయబడి ఉన్నది.

కొరమాను మీద ఎక్కుటకు శ్రమణులు సంసిద్ధులు కాగా జ్ఞాసంబంధులు వారిని నివారించేరు. అయినా వారు వినలేదు. వైదికకర్మానుష్ఠానమును నిందించిన పాపమును పరిహరించుకొనడానికి ఇది తగిన ప్రాయశ్చిత్తంగా శ్రమణులు భావిస్తూ ఉన్నారని జ్ఞానసంబంధులు సమాధానపడ్డారు. ఇట్లు ఆ కావ్యంలో వ్రాయబడ్డది.

సుబ్రహ్మణ్యస్వామి యిలా దక్షిణదేశంలో జైనులను జయించడానికై అవతరించినట్లే, ఉత్తరదేశంలో బౌద్ధులు ప్రబలినప్పుడు ప్రయాగలో అవతరించేరు. అప్పుడు వారికి కుమారిలభట్టు అనిపేరు. శ్రీ శంకరవిజయములో వారికథ ఉన్నది.

వైదికకర్మానుష్ఠానమును ఉద్ధరించుటకు కుమారిలభట్టు అవతరించేరు. ఆయన బౌద్ధమత నాస్తిక నిరాకరణం చేస్తూ తమదేహాన్ని అగ్నికాహుతి గావించేరు. కర్మనుష్ఠానము యొక్క ఘనతను ఉపదేశించుటకే వారు అలా చేసేరు.

మీమాంసాశాస్త్రంలో 'భాట్టదీపిక' ఒక ప్రముఖగ్రంథం. మీమాంస మూడు విధాలు. వానిలో భాట్టమతం ఒకటి. ఆ మతస్థులు కుమారిభట్టును అనుసరించినవారు. ఆ భాట్ట మతస్థులలో ఒకరు వ్రాసిన గ్రంథమే భాట్టదీపిక. దీనికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యాతలలో శంభుభట్టు అనే వారొకరు. భట్టనామం కుమారిలభట్టు నామంనుండి వచ్చినదే.

కొన్ని శంకరవిజయ గ్రంథాలలో దేవతలంతా పరమేశ్వరునిదగ్గరకు వెళ్ళి లోకంలో కర్మానుష్ఠానాలు తగ్గిపోయినవని మొరపెట్టగా పరమేశ్వరుడు శ్రీ శంకరాచార్యులుగ అవతరించినారనియు, వారితోబాటు దేవతలుకూడ ఫలాని ఫలానివారుగా జన్మించేరని వ్రాయబడ్డది. రామాయణములోకూడ దేవతలంతా ఇట్లే వెన్నుని యొద్ద మొరపెట్టుకొన్నారని అపుడు విష్ణువు శ్రీరామచంద్రులై అవతరించినారని, వారితోబాటు సురలు కూడ మానవులై పుడమిని పుట్టేరని చెప్పబడింది.

శంకరవిజయములో బ్రహ్మ మండన మిశ్రులుగ, బ్రహ్మాణి మండన మిశ్రులభార్య సరసవాణిగ, ఇంద్రుడు సుధర్మ మహారాజుగ, శ్రీహరి ఆచార్యుల శిష్యులలో నొకరైన పద్మపాదులుగ శ్రీ సుబ్రహ్మణ్యుస్వామి కుమారిలభట్టుగ అవతరించినారని వ్రాయబడింది.

కుమారిలభట్టు ప్రయాగలో అంతరించేరు. ఆ కాలంలో బౌద్ధమతం విజృంభించి ఉన్నది. బౌద్ధులు యుక్తి చాతుర్యంలో కూడిన విశేషప్రజ్ఞ కలవారు. వారికి వేదాధ్యయనము, ఉపనయనము, యజ్ఞయాగములు మొదలగువానియందు ప్రీతి లేదు. అందుచే వారంతా తమ యుక్తితో కూడి శేముషీపాటవంతో దేశంలోని ప్రజలనందరను నాస్తికులుగా మార్చనారంభించేరు.

కుమారిలభట్టు దీనిని గమనించి, ఈ స్థితిని ఏవిధముచేనైనా మార్చాలనుకొన్నారు. వారు బౌద్ధమతాన్ని ఖండిచాలనుకొన్నారు.

కొందరు వేదాలన్నీ అసత్యాలు; ధర్మశాస్త్రాలన్నీ దబ్బరలు అంటూ బయలుదేరుతూ ఉంటారు. అట్టివారు నేడును లేకపోలేదు. కాని, ఆ వేదశాస్త్రాలవలన ఏదైనా ప్రయోజనం ఉన్నదా లేదా? ఇపుడు వానిచే మేలేదైనా కలుగుతూ ఉందా లేదా? వానివల్ల పూర్వం శ్రేయ మేదైనా కలిగినదా లేదా? అనే విషయాలు చక్కగా ఆలోచించాలి. అంతేకాని వర్తమానంలో ఉండే కొన్ని అభిప్రాయాలకు అవి విరుద్ధంగా ఉన్నాయి కదా అని వానిని తప్పులనడం పెద్ద తప్పు. చక్కగా ఆలోచించి వానివల్ల ప్రయోజనం ఇసుమంతైనా లేదని తెలిసిన మీదట వానిని త్రోసిరాజనవచ్చును. అలా చేయకుండా ఏదో అనాలోచింతంగా తప్పని అనిసిస్తే వెంటనే వానిని నిరాకరించడం మంచిదికాదు. ఇలా పరిశీలింపకయే 'తప్పు' అని అనేవారు ఆనాటివలె ఈనాడుకూడ కనిపిస్తారు. ఏమైనా విచారింపకయే ఒకమహాసత్యాన్ని అంగీకరింపకపోవడం అన్నది ఏకాలంలోనైనా దోషమే అవుతుంది.

ఒక విషయంలో మనకు అనంగీకారం ఏర్పడుతుంది. మనం ఆ విషయాన్ని త్రోసిపుచ్చాలని నిరాకరించాలని అనుకొంటాం. దేనిని త్రోసివేయాలని అనుకొన్నామో ఆ విషయం ఏ ప్రయోజనాన్ని సాధించడానికి ఏర్పడినదో చక్కగా తెలిసికొని, ఆ ప్రయోజనం గొప్పదా? లేక వర్తమానంలోమనం ఏ ప్రయోజనాన్ని ఆశించి దానిని తిరస్కరిస్తూన్నామో ఆ ప్రయోజనం గొప్పదా? అనే విషయంలో ఒక నిశ్చయానికి వచ్చి ఆ పిమ్మట నిరాకరించడం తగినపని కాని ఊరకనే అదూరదర్శితతో ఒక మహాసత్యాన్ని, కాదనడం తగదు. బౌద్ధులతో వారించునప్పుడు కుమారిలభట్టులకు కూడ ఇదే అభిప్రాయం కలిగింది. ఈ కాలంలో ఎవరైనా దేనినైనా ఆక్షేపిస్తే కొంచెం ఆలోచించండి, ఇద్దరమూ కలిసి దీనిని గూర్చి ఆలోచిద్దాం; ఏది ఉపయోగకరమో తేల్చుకొందాం - అంటే 'నాన్సెన్సు' (అదంతా అర్థరహిం) అనేవారే ఎక్కువగా కనిపిస్తారు.

బౌద్ధం అంటే ఏమిటో? దానివలన కలిగే ప్రయోజనం ఏమిటో, సంభవించే అనర్ధం ఏమిటో కూలంకషంగా తెలిసికొనకుండా దానిని ఖండించడం కుమారిలభట్టుకు హితంకాదు. అందుచే వారు బౌద్ధల కడ వారి విద్యల నభ్యసించాలని నిశ్చయించుకొన్నారు. అయితే ఆ బౌద్ధులు బ్రాహ్మణులకు తమ శాస్త్రాలను బోధింపరు. కుమారిలభట్టు ఏలాగైనాసరే ఆ బౌద్ధశాస్త్రాలను బౌద్ధులయెద్ద నేర్వవలెననే పట్టుదలతో ఉన్నారు. మనుష్యులై అవతరించినారు గనుక మనుష్యులవలెనే కార్యసాధన యత్నించి బౌద్ధాన్ని ఖండించాలని దీక్షపూనినారు. తాము సుబ్రహ్మణ్యులుగా ఉండి విజయన్ని సాదించడంకంటే మనుష్యుడుగా విజయం సంపాదించడంలో ఘనత ఉన్నదని ప్రయోజనం ఉన్నదని వారు భావించినారు. దైవశక్తినే ఎల్లకార్యాలలోనూ ఉపయోగిస్తే సృష్టికార్యం సాగదు. అందుచే బౌద్ధులవలె వేషం ధరించి ఒక బౌద్ధవిహారంలోని విద్యాలయానికి చేరుకొన్నారు.

ఆ విహారానికి ఏడు అంతస్తులుఉన్నాయి. కుమారిలభట్టు తమ అంతరంగంలోనే ఆవశ్యక కర్మానుష్ఠానం కొనసాగిస్తూ బౌద్ధులతోకలిసి వారిచదువులు నేర్వనారంభించినారు. ఆ గ్రంథాలలో వైదికమతము, కర్మానుష్ఠానము నిందింపబడిన సందర్భము లన్నీ వీరికి బాధకలిగించేవి. అయినా వారు తమ వ్యథను వ్యక్తం చేయకుండా మనస్సులోనే బాధపడుతూ ఉండేవారు. అయినా కొన్నిసమయాలలో వేదదూషణం వినగానే వారు కన్నీరాపుకొనలేక పోయేవారు. దానిని అధ్యాపకులు గమనించి - ఇతడెవరో బ్రాహ్మణుడిలా ఉన్నాడు - అని అనుకోనేవారు.

ఒకనాడు ఇలాంటి సందర్భంలోనే కుమారిలభట్టు కన్నీరు పెట్టుకొనగా అధ్యాపకులు - ఏమయ్యా! ఎందుల కా కన్నీరు? అని ప్రశ్నించినారు. దానికి వారు సర్దుకొని - ఇవి ఆనందబాష్పములు, ఎంతో తెలివిగా దీనిని ఇక్కడ ఖండించేరు కదా! ఆ బుద్ధిచాతుర్యం తలచగా ఆనందబాష్పాలు పుట్టేయి. అంతే కాని ఏడ్పుకాదు - అని సమాధాన మిచ్చినారు.

ఇలా చాలామార్లు జరిగింది. చివరకు అధ్యాపకులైన బౌద్ధులకు ఇతడు బ్రాహ్మణుడేకాని బౌద్ధుడు కాడని నిశ్చయము కలిగిపోతుంది. దానితో వారు ఇక ఇతనిని ఇక్కడ ఉంచరాదని నిశ్చయించుకొన్నారు. అయితే ఏం చేయాలి? ఇతనిని పొమ్మనవలెనా? అనకూడదా? అన్న సందేహం కూడ వారికి కలిగింది. ఏమంటే అతడేదో బుద్ధిహీనుడు, అల్పజ్ఞుడు అయితే పొమ్మనండం వల్ల వారికి కలిగే నష్టం లేదు. కాని ఇతడు మహాబుద్ధిశాలి; అన్నిటి మర్మాలు చక్కగా గ్రహించేడు. అందుచే ఇతనిని జీవంతో ఉంచడం తమకుమేలుకాదని వారు నిర్ణయించుకొన్నారు. ఒకనాడు వారు ఈయనను హితవంచనగా విహారంయొక్క ఏడవ అంతస్తు మీదకు తీసికొనిపోయి క్రిందికి త్రోసివేసేరు. ఆ ఏడవ అంతస్తునుండి క్రిందకు పడుతూ కుమారిలభట్టు - 'వేదం ప్రమాణం అయితే నాకు ఆపద కలుగరాదు' అనే భావంతో ఒక శ్లోకం చెప్పినారు. అందుచే క్రిందపడినప్పుడు వారికి పెద్దదెబ్బలేమీ తగులలేదు కాని ఒక చిన్నరాయి మాత్రం వారి కంటిలో గ్రుచ్చుకొన్నాది.

పతన్‌ పతన్‌ సౌధతలాన్యరోరుహం యది ప్రమాణం శ్రుతయో భవన్తి|

జీవేయ మస్మిన్‌ పతితో సమస్థలే మజ్జీవనే తచ్ఛృతి మాన్యతా గతిః||

యదీతి సందేహంపదప్రయోగాత్‌ వ్యాజేన శాస్త్రశ్రవణాచ్ఛ హేతోః|

మమోచ్చదేశాత్‌ పతతో వ్యనక్షీత్‌ చక్షు ర్విధి కల్పనా సా||

- మాధవశంకరవిజయము.

అవతారపురుషులకు కూడా కోపము, భయము, సుఖము, దుఃఖము అన్నీ కలుగుతాయి. శ్రీరామచంద్రులవారుకూడా కోపభయ సుఖదుఃఖాదులన్నీ అనుభవించినారు. ఇవన్నీ మనోవృత్తులు. మనం చేయి కాలు కదలకుండా చేయగలమేకాని మనస్సును కదలకుండా నియమించలేము. జ్ఞానులు చేయి, కాలువలె మనస్సును కూడ తమస్వాధీనంలో ఉంచుకొంటారు. వారు మనస్సును కదలనీయరు. అట్టివారియందు మాత్రమే క్రోధాదులైన మనోవృత్తులు జన్మించవు. అందుచే వారికి ఏ దుఃఖము కలుగదు. అవతారపురుషులు అట్లుకాదు. వారియందు మనోవృత్తులు పుడుతూ ఉంటాయి. అందువల్లనే అవతార పురుషులకంటె జ్ఞానులే అధికులు అని అంటారు. అవతారపురుషులు ఏన్నో కార్యములు చేసి ఇతరులవలె సుఖదుఃఖాలు అనుభవిస్తాయి, కాని జ్ఞానులు తమ మనస్సును కదలనీయక మౌనంగా ఉంటారు.

తన కంటిలో రాయిగ్రుచ్చుకొన్నందున కుమారిలభట్టునకు క్రోధం వచ్చింది. 'వేదమును నేను ఎంతగానో నమ్ని ఉన్నాను, అయినా నాకే కష్టం కలిగింది'- అని వారు అనుకొన్నారు. సరిగా ఆ సమయమందు అశరీరవాణి - 'ఓయీ నీవు వేదము ప్రమాణముగా ఉండినచో-అని కొంత సందేహాన్ని ప్రకటించేవు; అలా చేసినందుకు ఈ నష్టం కలిగింది' - అని పలికినది.

ఆ తరువాత కుమారిలభట్టు లోకంలో మీమాంసా శాస్త్రాన్ని ఎక్కువగా ప్రచారం చేయసాగేరు. మీమాంస కర్మ ప్రధానమైనది. బౌద్ధమతం కర్మకూ, స్వామికికూడా సున్నచుడుతుంది. కుమారిలభట్టు బౌద్ధమతాన్ని నిరాకరించి 'కర్మయే ఫలితాన్ని ఇస్తుంది. స్వామిని గూర్చి ఆలోచిస్తూ కూర్చోక కర్మాచరణం చేయండి, అని సత్ఫలాలూ కర్మచే అనుగ్రహింపబడతాయి'- అని ప్రచారం చేయనారంభించేరు. ఈ విధంగా మీమాంసకులు శంకరాచార్యుల వారికి ముందుగానే బౌద్ధమతాన్ని ఖండించి అణచివేసేరు. బౌద్ధులు ఎక్కవగా వాదించినది మీమాంసకులతోడనే.

కర్మను, స్వామినిరెండిటిని కూడ బౌద్ధులు అంగీకరించరు. మీమాంసకులు కర్మను అంగీకరిస్తారు, స్వామిని అంగీకరించరు. ఈ విధంగా ఆచార్యులవారు అవతరించునప్పటికి బౌద్ధుమత నాస్తికత నశించి కర్మ ప్రధానమైన మీమాంసక మతం తలయెత్తి ఉన్నది.

శ్రీ శంకరులు గోవిందభగవత్పాదాచార్యుల వారిచే ఉపదేశింపబడి కాశీక్షేత్రానికి వచ్చి సూత్రభాష్యాన్ని రచించేరు. తరువాత దిగ్విజయం చేయడానికై వారు తూర్పుదిక్కుగా బయలుదేరేరు. అపుడు వారికి కుమారిలభట్టు 'తషాగ్ని ప్రవేశం' చేస్తున్నారని తెలియవచ్చింది. తుషాగ్ని ప్రవేశం అనగా కాలుతూ ఉన్న ధాన్యపుపొల్లులో శరీరాన్ని నెమ్మదిగా దగ్ధంచేయడం.

కుమారిలభట్టు, వారి అనుయాయులు కర్మ మాత్రం చాలును అంటారు. కాని- ''కేవలం కర్మవల్ల శ్రేయస్సు లభించదు. కర్మకూ, కర్మఫలానికీ పరిమితి ఉంది. అనంతమైన కాలము సుఖశాంతులను అనుభవింపజేయడానికి కర్మానుష్ఠానం ఒక్కటీ చాలదు. అనంతరమైన శ్రేయాన్ని కలిగించే శక్తి దానికి లేదు. నిత్యమైన శ్రేయస్సును పొందవలెనంటే జ్ఞానాన్నే ఆశ్రయించాలి; వేదాంతమార్గమునే అనుసరించాలి'-అని కుమారిలభట్టును ఓప్పించడానికి ఆచార్చులవారు నిశ్చయించుకొన్నారు. కర్మవాదానికి మూలస్తంభ##మైన కుమారిలభట్టు జ్ఞానవాదాన్ని అంగీకరిస్తే మిగిలినవారందరూ ఒప్పుకొనినటులే కదా! అందులకే శంకరులు కుమారిలభట్టు దగ్గఱకు వెళ్లవలెనని అభిప్రాయపడ్డారు.

కుమారిలభట్టు తుషాగ్నిలో ప్రవేశించినారని తెలిసినంతనే శంకరులు తొందరగా పయనించి వారి వద్దకు చేరుకొన్నారు. కుమారిలభట్టు అప్పటికే తుషాగ్నిలో కాలిపోతూఉన్నారు వారిని చూచి శంకరులు మీరు తుషాగ్ని ప్రవేశం ఎందుకు చేసినారు? అని ప్రశ్నించేరు.

'నేను బౌద్ధుమతగురువులయొద్ద అసత్యాలు పలికి వారి మతవిషయాలు తెలిసికొన్నాను. ఒక్క అక్షరము నేర్పినా నాకు వారు గురవులు కదా! నేను గురుద్రోహం చేసినాను. కర్మయే ప్రధానమని కర్మవాదాన్ని లోకంలో నిలబెట్టడానికై వచ్చిన నేను గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకొనకుండా ఎలా ఉండగలను? అందుచే ధర్మశాస్త్రాలు పరిశీలించేను. గురుద్రోహానికి క్లిష్టమైన మరణమే ప్రాయశ్చిత్తమని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ కారణంగా నేను తుషాగ్ని ప్రవేశం చేసినాను'-అని కుమారిలభట్టు చెప్పినారట.

ఒకవేళ మనకే అట్టి ప్రాయశ్చిత్త విధానంలో ఒక గ్రంథం కనిపిస్తే మనం ఆ గ్రంథాన్ని తగులబెడతామే కాని అనుసరించము. కుమారిలభట్టు గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం కనుపించగానే ఆనందించేరు. వారికున్న కర్మశ్రద్ధ అంతటిది.

ఆచార్యులు కుమారిలభట్టు చెప్పినదంతా విని- కేవలం కర్మవల్ల నిత్యమైన శ్రేయం కలుగదని సహేతుకంగా వారించి నిరూపించి జ్ఞానమార్గాన్ని వారికి బోధించేరు.

వారి బోధ విని కుమారిలభట్టు-'స్వామీ! నాకు మీ దర్శనం లభించింది. నేను కృతార్థుడును. మీరు చెప్పేవిషయం గ్రహిస్తే లోకానికి మేలు కలుగుతుంది. కాని నేను ప్రస్తుతం మీరుచెప్పిన ఈ మేలివిషయాన్ని లోకానికి బోధించలేను. అశక్తుడను. తాము నాయెడ దయ చూపితే నాదొక చిన్నమనవి. మండనమిశ్రులనే పరమ మీమాంసకులున్నారు. వారు తీవ్రకర్మ మార్గప్రవర్తకులు. ఆయన మీ వాదాన్ని అంగీకరిస్తే లోకం అంతా అంగీకరిస్తుంది. వారి యొద్దకు వెళ్ళండి'- అని శంకరులను వేడుకొని శరీరత్యాగం చేసేరు.

ఇపుడు మనంచేసే ప్రతికర్మకూ ముందు 'పరమేశ్వర ప్రీత్యర్థం' అని సంకల్పం చేస్తాము. ఈ సంకల్పవిధానమును శంకరులే ఏర్పరచేరు. కుమారిలభట్టుతో ప్రసంగించిన తరువాత కాలంలో భట్ట మతస్థాపకులను కలిసికొని ఆచార్యులవారు కర్మలను ఈశ్వార్పణబుద్ధి ఆచరించాలని పై సంకల్పవిధానం 'పరమేశ్వర ప్రీత్యర్థం' అని ఏర్పాటు చేశారు. అంతకు పూర్వకాలంలో సంకల్పమునందు పరమేశ్వర ప్రీతికై చుయుచున్నాను, అనే భావం లేదు. తరువాతికాలంలో యజ్ఞయాగాదులందు కూడ పరమేశ్వరార్పణము చేయుట అలవాటైనది.

కుమారిలభట్టు బ్రాహ్మణ్యముకొరకై ధర్మశాస్త్రములు చెప్పినట్లు శరీరత్యాగం కావించేరు. అట్టి త్యాగముతో ఆరాధింపబడిన మనమతానికి భయమేమీ లేదు. ఇంకను బ్రాహ్మణ్యము ప్రపంచమున కాలూని నిలువగలదనుటకు సందేహము కూడా అక్కఱలేదు. అట్టి మహోన్నత త్యాగంవల్లనే ధర్మశాస్త్రాలు నిలచి ఉన్నాయి.

చిట్టచివర కుమారిలభట్టు అగ్గిప్రవేశం చేసినటులే జ్ఞాన సంబంధులు కూడా చిట్టచివర అగ్నిప్రవేశం చేసేరు. పరమేశ్వరుడే ఆ అగ్ని, వారు అగ్నిరూపంగా ఉన్న పరమేశ్వరునిలో లీనం అయ్యేరు.

'సేనానీ రగ్నిభూ ర్గుహః'

- అమరకోశము.

సుబ్రహ్మణ్యుడు అగ్నిలో పుట్టేరు. అందుచే అగ్నిలోలీనం కావడం వారికి సులభం. అగ్నిలో పుట్టుటచేతనే వారికి 'అగ్నిభూః' అని పేరు కలిగింది. షట్‌కృత్తికలు ఆయనకు తల్లులైనందున 'కార్తికేయుడు' అనియు, గంగ వారికి తల్లి అయినందున 'గాంగేయుడు' అనియుకూడ వారికి పేర్లు ఏర్పడ్డాయి. వీరంతా వారికి మాతృస్థానం. అందరిని రక్షించి దేవతల కష్టాలు నివారిచడానికి వారు స్కందులైనారు. కృత్తిక ఆరు నక్షత్రాలు. ఆ ఆరిటిపేర్లు వేదంలో చెప్పబడ్డాయి. ఆరవ నక్షత్రం పేరు కృత్తిక. తిధులలో ఆరవది షష్ఠి చాంద్రమానము ప్రకారం ఈ మాసం కార్తికం.

కుమారిలభట్టు, జ్ఞానసంబంధులు ఇద్దరును కుమారిస్వామి అవతారములే. ఇరువురును వైదికకర్మానుష్ఠానమును స్థాపించినవారే. ఒకరు ఉత్తరదేశంలోను, మరియొకరు దక్షిణదేశంలోను కర్మానుష్ఠానావశ్యకతను బోధించి వేదప్రచారం చేసారు. ఇరువురును వేదవేత్తలే. అంబికాదుగ్ధము లానినందున ఇద్దరూ వేదాలను లెస్సగా గ్రహించగలిగేరు. తమిళ##దేశమును పూర్తిగ వైదిక ధర్మమున ప్రతిష్ఠితం చేయడానికి వీరికి పండ్రెండేండ్లు పట్టినదట, ఇరువురూ ఒకే ఆశ్రమంలో ఉండి ఇలా చేసేరు.

మన ఆచార్యులారు ముప్పదిరెండేండ్లకాలం ఉన్నారు. వారు మరియొక ఆశ్రమం స్వీకరించవలసి వచ్చింది. కేవలం పండ్రెండేండ్లు కాకుండా ఆసేతుహిమాచలం దిగ్విజయం చేయడానికి మరికొంతకాలం ఉండవలసి వచ్చింది. పుత్రుడు ఆ విధంగా అయితే తండ్రి యీవిధంగా, శంకరులు తమ సౌందర్యలహరిలో

తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః

పయః పారావారః పరివహతి సారస్వత మివ|

దయావత్యా దత్తం ద్రవిడశిశు రాస్వాద్య తవయత్‌

కతీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా||

అని వ్రాసిరి. 'అమ్మా! అనుగ్రహంతో కూడిన నీ క్షీరము ప్రవహించి వస్తోంది. అది సారస్వతామృతము. వాగమృతము. నీవు దానిని పరమకృపతో ద్రవిడశిశువునకు త్రావనిచ్చేవు'- అని జ్ఞానసంబంధులను ప్రశంసించేరు. స్కందడు సంఘకవులలోఒకడై ఈ విధంగా అవతరించేరు.

ఆచార్యులవారు తమ దిగ్విజయకాలంలో కుమారిలభట్టుకు తమ దర్శనాన్ని అనుగ్రహించి, ఆయన ప్రార్థనము మన్నించి మండనమిశ్రులవద్దకు వెళ్ళేరు. మండనమిశ్రుల మతాన్ని నిరాకరించి వారికి వేదాంతమార్గాన్ని బోధించేరు.

ఇలా కుమారిలభట్టుయొక్క ఘనత, జ్ఞానసంబంధులవారి ఘనత ఆచార్యసంబంధమై ఉన్నది. ఒకరికథ ఆచార్యులకథయందేవస్తే, మరియొకరి కథాప్రశంస ఆచార్యులవాక్కులో గోచరిస్తుంది. ఇరువురును నాస్తికమత నిరాకరణం చేసినవారే. ఇరువురును కుమారస్వామి అవతారుములే.

తండ్రియైన పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామికి నమస్కరించినారని వేదములో చెప్పబడింది.

ఉమాకోమలహస్తాభ్యాం సంభావితలలాటంకం|

హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజమ్‌||

ఋగ్వేదములో పంచరుద్రం అని ఐదుచోటులందు ఉన్నది. అందులో ఒకచోట ఈ మంత్రం వస్తుంది. 'వేదపాదస్తవం' అని స్తోతగ్రంథం ఒకటి ఉంది. దానిలో ఒక్కొక్కశ్లోకంలో ఒక్కొక్కపాదం వేదమంత్రంమై ఉన్నది. పై శ్లోకం ఆ గ్రంథం లోనిదే. ఈ శ్లోకంలో నాల్గవపాదంలో వేదమంత్రం ఉన్నది. ఉమాదేవియొక్క కోమలహస్తములచే అలంకరింపబడిన కుమారస్వామి యని వర్ణింపబడినది.

శంకరవిజయములలో ముఖ్యమైనవి ఐదు. అవి మాధవీయము, చిద్విలాసము, ఆనందగిరీయము, వ్యాసాచలీయము, కేరళీయము- అనునవి. వీనికి ముందుకూడా కొన్ని శంకర విజయములు ఉండి ఉండవలెనని తోచుచున్నది. 'వ్యాసాచలీయము'దక్క మిగలిన శంకరవిజయములు అన్నీ ముద్రింపబడ్డాయి. 'మాధవీయము' చాలా సంవత్సరములకు వెనుక 'రాయల్‌ ఏషియా సోసైటీ' వారిచే ముద్రింపబడినది. కేరళీయశంకరవిజయము మళయాళమునందు వెలువడినది. మాధవీయశంకరవిజయకారుడు ప్రాచీనశంకరవిజయ గ్రంథముల నుండి విషయమును సంగ్రహించుచున్నానని వ్రాసెను. అందుచే పైవానికంటె ప్రాచీనములైన శంకరవిజయములు కొన్ని ఉండి ఉండవలెనని తోచుచున్నది.

మాధవీయశంకరవిజయమునకు 'డిండిమము' అనెడి వ్యాఖ్యానమున్నది. మాధవీయమున శ్రీ శంకరాచార్యులవారు కైలాసమునకు పోయి రని చెప్పబడినది. ఆ స్థలములో వ్యాఖ్యానకారుడు 'శివరహస్యము' నుండి కొన్ని శ్లోకముల నెత్తి వ్రాయుచు' ఈ కథలన్నియు' 'బృహత్‌ శంకరవిజయము' నందు విపులముగా చెప్పబడె నని వ్రాసినాడు. మాధవీయెమును సంక్షేపశంకరవిజయం అంటారు.

కేరళీయశంకరవిజయంలో వ్యాసాచలీయంశంకర విజయాన్ని గురించి చెప్పబడ్డది. వ్యాసాచలీయము పురాతనమైనదని అందు పేర్కొనినారు.

అత్యున్న తస్య కావ్యద్రు వ్యాసాచల మహీరుహః

అర్థప్రసూనా న్యాదాతు మసమర్థో2హ మద్భుతమ్‌|

వ్యాసాచలం మీద శంకరవిజయం అనే వృక్షం మొలిచినది. కొండమీది చెట్టు అయినందున అది చాలా ఉన్నతమైనది. అందుచే సామాన్యుడైన నేను దాని అర్థం అనే పుష్పాలను గ్రహించలేకుండా ఉన్నానుఅని వారు అన్నారు.

ఇలా శంకరవిజయాలే కాక 'శంకరాభ్యుదయం' అనే గ్రంథం ఒకటి ఉంది. దానిని రాజచూడామణిదీక్షితులు వ్రాసినారు. ఆరుసర్గలు గల ఆ గ్రంథంలో కూడా శంకరచరిత్ర వర్ణింపబడింది.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page